నారాయణపేట: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపే విధంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. జిల్లాలో నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డా.వినీత్ సూ చించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌బీ, డీసీఆర్‌బీ, ఐటీ కోర్, ఎంటీ, ఆర్‌ఐ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. ప్రతి విభాగం పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, విధి విధానాలపై సంబంధిత అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. పోలీసు హెడ్ క్వార్టర్స్, కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాలను ఆయన పరిశీలించి.. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలన్నారు.
జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌లో వీక్షించే విధంగా చూడాలని తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ఎస్పీ సూచించారు. ప్రజా సేవలో క్రమశిక్షణ, పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భవిష్యత్‌లో జిల్లా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రియాజ్ హూల్ హాక్, ఆర్‌ఐ నర్సింహ, ఎస్‌ఐలు నరేశ్, సునీత, పురుషోత్తం, సురేశ్ ఉన్నారు.
ప్రజావాణి రద్దు
నారాయణపేట: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని.. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,067
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,067, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.5,770, వేరుశనగ గరిష్టంగా రూ.5,112, కనిష్టంగా రూ.3,151 చొప్పున పలికాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,719 ఒకే ధర లభించింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత శనివారం తిరిగి లావాదేవీలు ప్రారంభించారు.
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్‌లోని భర్కత్‌పుర పీఎఫ్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు, ఉపాధ్యక్షులు జీబీ పాల్, భగవంతు తెలిపారు. శనివారం స్థానిక ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీఎఫ్ కార్యాలయం నుంచి వచ్చిన డిమాండ్ లేఖలపై అనేక మంది విశ్రాంత ఉద్యోగులు గతేడాది నుంచి హయ్యర్ పెన్షన్ మంజూరుకు రూ.లక్షలు డీడీల రూపంలో చెల్లించినా ఇంత వరకు పెన్షన్ మంజూరు చేయలేదన్నారు.
అనేక మంది విశ్రాంత ఉద్యోగులకు ఇంత వరకు డిమాండ్ లేఖలను కూడా పంపలేదని, ఇంకొందరికి హయ్యర్ పెన్షన్ ఏరియర్స్ చెల్లించలేదని ఆరోపించారు. పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నారాయణ, నాగాంజనేయులు, అంజన్న, నర్సింహులు, బీహెచ్ కుమార్, సలీం, రియాజొద్దీన్, డేవిడ్, లలితమ్మ, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ