
అమ్మా.. మేమేం పాపం చేశాం
సాక్షి మహబూబాబాద్: ‘అమ్మానాన్న.. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మేం కడుపున పడ్డామని తెల్వగానే సంబురపడ్డారు. అంగరంగ వైభవంగా బారసాలలు చేశారు. బోసి నవ్వులతో, బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసిపోయారు. అల్లారుముద్దుగా పెంచిన మాపై కనికరంలేకుండా కర్కశంగా మారావెందుకమ్మా.. నీవు నీటిలో ముంచి ఊపిరాడకుండా చేస్తే తమ్ముడి ప్రాణం ఎలా కొట్టుకుందో, చీకట్లో కత్తితో నా మెడ కోస్తే నేను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఎవరో కోసి వెళ్లారని నమ్మించావు. ప్రాణాలతో బయటపడ్డ నన్ను చూసి సంబురపడ్డటూ నటించావు. తర్వాత తాడు మెడకు చుట్టి ఉరితీస్తుంటే కొట్టుకుంటున్న నన్ను చూస్తే నీకు ఏమి అనిపించలేదా అమ్మా.. మమ్ముల్ని చంపడానికి నీ మనసెలా ఒప్పిందమ్మా’ అంటూ పిల్లలు మనోవేదన చెంది ఉంటారు. కేసముద్రం మండలం నారాయణపురంలో శిరీష తన ఇద్దరు కుమారులను హత్యచేసింది. ఇది తెలిసిన గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు.
చంపడానికే నిర్ణయం..
ప్రేమగా చూసుకునే భర్త ఒక్కసారిగా మారినట్లు భావించడం, పిల్లలు తన ప్రేమకు దూరమవుతున్నారని ఆందోళన చెందడం మొదలైన సంఘటనలతో తల్లి శిరీష ముగ్గురు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిని అమలు చేసేందుకు పకడ్బందీగా వ్యూహం రచించింది. ఇందులో భాగంగా చిన్నకుమారుడు నిహాల్(2)ని సంపులో పడేసి చంపాలని చూడగా, ఆ సమయంలో అత్త రావడంతో ప్రమాదవశాత్తు పడినట్లు చిత్రీకరించింది. ప్రాణాలతో బయటపడ్డ.. మరోసారి ఇంట్లో ఎవరూలేని సమయంలో సంపులో పడేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. కొద్దిరోజుల తర్వాత రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పెద్దకుమారుడు మనీష్‌కుమార్ మెడపై కత్తితో కోసి హత్య చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ మనీష్‌కుమార్‌ను ఈనెల 24న ఇంట్లో ఎవరూలేనిది చూసి ఉరివేసి చంపేసింది. దీనిని కూడా జ్వరంతో చనిపోయినట్లుగా చిత్రీకరించాలనుకుంది. అది సఫలమైతే రెండో కుమారుడు మోక్షిత్‌ను కూడా చంపి, తాను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది.
ముందే గమనిస్తే ప్రాణాలు దక్కేవి..
తల్లి తన కుమారులను చంపేందుకు పన్నిన వ్యూహాన్ని ముందే గమనిస్తే ఆ ఇద్దరు పసిప్రాణాలు దక్కేవని, కుటుంబ సభ్యులు, బంధువులు ఏడుస్తూ చెప్పడం అందర్ని కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలు మొదటిసారి మృత్యువు దగ్గరకు వెళ్లి, రెండో సారి మృత్యువు ఒడిలోకి చేరాల్సి వచ్చింది. చిన్నకుమారుడు సంపులో పడి ప్రాణాలతో బయటపడడం, మరోసారి అదే సంపులోపడి చనిపోయినా అనుమానం రాలేదు. పెద్దకుమారుడిని మెడపై కత్తితో కోసి హత్యాయత్నం చేసిన సంఘటన కుటుంబ సభ్యులు పసిగట్టలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణలో తెలుసుకోకపోవడం, కన్నతల్లే కర్కశంగా మారి ఇద్దరు కొడుకుల్ని పొట్టనబెట్టుకున్న విషయం పసిగట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. అటు అత్తామామలు కాని, భర్తకు కాని, విచారణ చేపట్టిన పోలీసులకు కాని శిరీషపై అనుమానం రాకపోవడం ఏంటని జిల్లాలో చర్చానీయాంశంగా మారింది.
తల్లడిల్లుతున్నా మాపై జాలి కలగలేదా..
ముందే అనుమానిస్తే మా ప్రాణాలు దక్కేవి
ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఘటనతో నారాయణపురంలో విషాదం