
భార్యను చంపిన భర్త ..
నెల్లికుదురు : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు శనివారం నెల్లికుదురు పీఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నెల్లికుదురు మండలం ఆలేరులో ఈ నెల 3న కుమారుడి మీద కోపంతో క్షణికావేశానికి గురైన చీకటి నరేశ్ తన భార్య స్వప్న (38)ను గొడ్డలితో నరికి చంపి పరారైన విషయం విదితమే. ఈ ఘటనపై మృతురాలు సోదరి మాచర్ల ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నెల్లికుదురు నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద కుమారుడు విక్రం జులాయిగా తిరుగుతుంటే మందలిస్తున్న ప్రతీసారి తల్లి అడ్డు పడుతుందని, దీంతో తన భార్యను చంపితేనే కుమారుడు మారుతాడనే ఉద్దేశంతో ఆమెను గొడ్డలితో నరికి చంపినట్లు నరేశ్ ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై చిర్ర రమేశ్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.