
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతూ మృతి
మహబూబాబాద్ రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనగపురం శివారు పాత తండాలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దీపిక శనివారం కేసు వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన ధరావత్ కృష్ణ (45), భారతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి 30 గుంటల వ్యవసాయ భూమి ఉండగా దానితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలు, వ్యవసాయానికి రూ.5 లక్షల మేర అప్పు అయ్యింది. ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్న కృష్ణ.. ఈ నెల 01వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీపిక తెలిపారు.