
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
● ఆక్రమణకు గురైన డ్రెయినేజీలు
● పేరుకుపోయిన మురుగు, వ్యర్థాలు
● దుర్వాసనతో ప్రజల అవస్థలు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన వీధులతోపాటు పలు వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో మురుగును తొలగించే అవకాశం లేకుండాపోయింది. దీంతో వ్యర్థాలు, మురుగు పేరుకుపోయి తీవ్ర దర్గంధం వెదజల్లుతోంది.
ఆక్రమణలతో కానరాని డ్రెయినేజీలు
మెయిన్ రోడ్డు, సెకండ్ మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్, ఇందిరానగర్, పాతడోర్నకల్‌తోపాటు వార్డుల్లో సైడు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, డబ్బా కొట్లు, తోపుడు బండ్లు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేయడంతో కాల్వలు కనుమరుగయ్యాయి. కాల్వలను మూస్తూ సిమెంట్ కవర్లు ఏర్పాటు చేసి వాటిపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో కాల్వల్లో వ్యర్థాలు తొలగించే అవకాశాలు లేకపోయింది. అప్పుడప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కాల్వల్లోని వ్యర్థాలను తొలగించేందుకు శ్రమిస్తున్నా సాధ్యపడటం లేదు.
దోమలు, దుర్గంధంతో ఇబ్బంది..
డోర్నకల్ మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.1.2 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు జరుగుతుండగా తమ ఇళ్ల ముందు కాల్వ నిర్మించవద్దంటూ కొంతమంది కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో నిర్మాణ పనులు పూర్థిస్థాయిలో జరగలేదు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంతో డ్రెయినేజీ ద్వారా మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్, ఇందిరానగర్, పాతడోర్నకల్‌లో మురుగునీరు, వ్యస్థాలు డ్రెయినేజీలో నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని చోట్ల డ్రెయినేజీను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతో మురుగు, వ్యర్థాలు తొలగించలేకపోతున్నారు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారడంతో దుర్గంధం, దోమలు, ఈగలతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి కాల్వలపై ఆక్రమణలను తొలగించి డ్రెయినేజీ, సైడు కాల్వలను శుభ్రపర్చాలని ప్రజలు కోరుతున్నారు.

డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం