
ప్రజల ముంగిట్లోకి న్యాయసేవలు
● అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్
● కంబాలపల్లిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు అందుబాటులోకి న్యాయసేవలు వచ్చినప్పుడే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని మానుకోట అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని కంబాలపల్లి గ్రామంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ శనివారం ఏర్పాటు చేశారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు గ్రామాల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు న్యాయాన్ని పొందలేనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయిస్తే ఖర్చులేకుండానే ప్రతివాదులకు నోటీసులు పంపించి తద్వారా న్యాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఎవరైనా న్యాయవాదిని నియమించుకోలేని వారు సంప్రదిస్తే సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో పారా లీగల్ వలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎస్సై దీపిక, కంబాలపల్లి పంచాయతీ సెక్రటరీ మయూరి, పారాలీగల్ వలంటీర్లు దొంతు శ్రావణ్ కుమార్, కొత్తపల్లి సిద్ధార్థ, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.