
వరుడిగా వేట వేంకటేశ్వరస్వామి
● నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
గార్ల: వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం వేట వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మర్రిగూడెంలో నేటి నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు గార్ల నుంచి ప్రత్యేక రథంపై బయలుదేరారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వేట వేంకటేశ్వరస్వామి వారిని పట్టువస్త్రాలు ధరింపజేసి, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి సర్వాంగ సుందరంగా వరుడిగా తయారు చేశారు. అనంతరం స్వామివారిని గార్ల మాజీ సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ 50 కేజీల పూలు తెప్పించగా, అర్చకులు పూలమాలలతో అలంకరించిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి మేళతాళాలతో గార్ల పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తుండగా, మహిళలు కోలాటం నృత్యాలు వేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యం పొందారు. మర్రిగూడెం దేవాలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు భద్రత దృష్ట్యా గార్లలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి తరలిస్తారు. గార్ల నుంచి మర్రిగూడెం వరకు ఉత్సవ విగ్రహాల వెంట ఎస్సై ఎస్‌కె రియాజ్‌పాషా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గార్ల మాజీ సర్పంచ్‌లు అజ్మీర బన్సీలాల్, గంగావత్ లక్ష్మణ్‌నాయక్, జిల్లా ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, ఈఓ సంజీవరెడ్డి, పుల్లఖండం రమేష్‌బాబు, పరుచూరి కుటుంబరావు, వేమిశెట్టి శ్రీనివాస్, పి.వేణుగోపాల్, ఎం. రాములు, బాదావత్ చంటి, అర్చకులు రామాయణం అచ్యుతాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.