
అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమస్యలు పరిష్కర
● టీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు అంగవైకల్యం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు యాజమాన్యం పరిహారం అందించాలని, వారి కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆర్టిజన్లుగా గుర్తించాలని, రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ గౌరవ అధ్యక్షుడు జి.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచర్ల కుమారస్వామి, వరంగల్ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్, నాయకులు పూర్ణచారి, వరుణ్ గౌడ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.