
పాకాల అందాలు అదరహో..!
పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి
ఖానాపురం : పర్యాటకానికి నెలవు పాకాల.. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి నిత్యం పెరుగుతోంది.. పాకాల అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు.. పర్యాటకులు పెరుగుతుండటంతో పాకాలకు ఆదాయం సైతం వస్తుంది. దీంతో అభివృద్ధికి సైతం ముమ్మర అడుగులు పడుతున్నాయి.. జిల్లాలో ఏకై క పర్యాటక ప్రాంతం కావడంతో పాటు పాకాలకు ప్రపంచ, దేశ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉండడం, చక్కటి ఆహ్లాదాన్ని పంచుతుండటంతో పర్యాటకులు తరలివస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఏకై క పర్యాటక ప్రాంతంగా పాకాల. ఈ సరస్సు అందాలతో పాటు మత్తడి వద్ద, తూము లీకేజీల నీటితో జలకళ సంతరించుకుంటుంది. సుమారు 52రోజులుగా మత్తడి పోస్తూనే ఉంది. సెలవులతో పాటు సాధారణ రోజుల్లోనూ పాకాల అందాలు చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. డీఎఫ్‌ఓ అనూజ్‌అగర్వాల్, ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్‌ల ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతూనే ఉన్నారు. సెప్టెంబర్‌లో పాకాలకు 5,489 మంది పర్యాటకులు రావడంతో వివిధ రూపాల్లో రూ.3,26,610 ఆదాయం సమకూరింది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో పాకాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 4,235 మంది పర్యాటకులు రావడంతో రూ.2,60,710 ఆదాయం వచ్చింది. పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఫారెస్ట్ శాఖ ద్వారా వస్తున్న ఆదాయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వినూత్న రీతిలో అభివృద్ధి పనులకు అధికారులు శ్రీకారం చుట్టి పర్యాటకులను ఆకిర్షించే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. దీంతో పాకాలలో పర్యాటకుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది.
పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
పాకాల అందాలను పర్యాటకులు వీక్షించేలా చర్యలు చేపడుతున్నాం. పాకాలకు వచ్చే పర్యాటకులకు మధురానుభూతి కలిగే విధంగా అభివృద్ధి పనులు సైతం చేస్తున్నాం. ఇప్పటికే మంజూరైన నిధులతో రెస్టారెంట్లను సైతం ఏర్పాటు చేయనున్నాం. పాకాల అందాలను వీక్షించేందుకు వచ్చే వృద్ధులకు బ్యాటరీ వాహనాలు సైతం తెచ్చాం. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నాం.
– పుప్పాల రవికిరణ్, ఎఫ్‌ఆర్‌ఓ, నర్సంపేట

పాకాల అందాలు అదరహో..!

పాకాల అందాలు అదరహో..!