
ప్రపంచ టాప్ 2శాతం శాస్త్రవేత్తల్లో డాక్టర్ రమేశ్
నర్సంపేట రూరల్ : అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఎల్సివియర్ (నెదర్లాండ్స్) సంయుక్తంగా ప్రకటించిన ప్రపంచ టాప్ 2శాతం శాస్త్రవేత్తల జాబితాలో వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కళాశాల వైద్యుడు కందిమల్ల రమేశ్ నాలుగో ఏడాది వరుసగా ఎంపికయ్యారు. డాక్టర్ కందిమల్ల రమేశ్ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన బయో కెమిస్ట్రీ విభాగం ఇన్‌చార్జ్ హెడ్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2022 నుంచి 2025 వరకు వరుసగా నాలుగో సారి ఈ గౌరవం లభించడం విశేషం. డాక్టర్ రమేశ్ క్లినికల్ మెడిసిన్ ప్రధాన విభాగంలో, న్యూరాలజీ, న్యూరోసర్జరీ ఉప విభాగంలో 3,60,881మంది శాస్త్రవేత్తల్లో 3,405వ స్థానంలో నిలిచారు. ఆయనకు హెచ్–ఇండెక్స్, 17, హెచ్‌ఎం ఇండెక్స్ 5.91లు నమోదు అయ్యాయి. న్యూరో జెనరేటివ్ వ్యాధులు, మైటోకాండ్రియా బయాలజీ, అల్జీమర్స్ వ్యాధిపై పరిశోధనలు, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమైన విశ్లేషణలను పరిగణనలోకి తీసుకున్నట్లు డాక్టర్ రమేశ్ తెలిపారు. ఈ గుర్తింపు తమ గురువులు, సహచరులు, పరిశోధన భాగస్వాములు, విద్యార్థుల మద్దతుతో సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ మానవ ఆరోగ్యానికి ఉపయోగపడే బయో మెడికల్ పరిశోధనలను కొనసాగించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.