వాషింగ్టన్: ఇరాన్ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ పోర్టులను అమెరికా సైన‍్యం నిర్బంధించడం ప్రారంభించింది. అంతేగాక, ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీచేశారు. “గల్ఫ్‌లో మా నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తాం” అని అన్నారు.
ఇరాన్ నౌకాదళం ఇక పనిచేయలేని స్థితిలో ఉందన్నట్లు ట్రంప్ అతిశయోక్తితో ట్రూత్‌లో పోస్ట్ చేశారు. “ఇరాన్ నౌకాదళం సముద్ర అడుగునే ఉంది. 158 నౌకలు పూర్తిగా నాశనమయ్యాయి. మేము దాడి చేయని వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఇరాన్ వాటిని ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ అని పిలుస్తోంది.. కానీ, అవేమో చిన్న నౌకలు. అవి ప్రమాదమని మేము భావించడంలేదు.
హెచ్చరిక చేస్తున్నాను.. ఈ నౌకల్లో ఏదైనా మేము చేపట్టిన మా నిర్బంధానికి దగ్గరగా వస్తే, సముద్రంలో పడవలపై మత్తు పదార్థాల వ్యాపారులను ఎదుర్కొనే విధానంలో వీటిని కూడా ఎదుర్కొని వెంటనే నాశనం చేస్తాం. ఈ చర్య వేగంగా, క్రూరంగా ఉంటుంది. పీఎస్ సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే మత్తు పదార్థాల్లో 98.2% ఆగిపోయాయి” అని ట్రంప్ తెలిపారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని నిర్బంధించడానికి వేసుకున్న ప్లాన్‌లో తాము పాల్గొనబోమని నాటో మిత్ర దేశాలు సోమవారం తెలిపాయి. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటామని సూచించాయి, ఈ నిర్ణయం ట్రంప్‌కు అసహనం కలిగించి, కూటమిలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది.


