న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
ఈ కష్టకాలంలో భారత్-ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్‌కు టోల్ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
“ఇప్పటి వరకు ఇరాన్ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.
ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.
కాగా, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల‍్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇచ్చింది.
నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు.


