అలంకారప్రాయం | - | Sakshi
Sakshi News home page

అలంకారప్రాయం

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

● జిల్లాకు ఎండ గండం.. ● 40 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలు ● బెంబేలెత్తుతున్న జనం ● పీహెచ్‌సీల్లో నామమాత్రంగా ఓఆర్‌ఎస్‌ కార్నర్లు ● పలుచోట్ల కనిపించని వైనం ● ఉపాధి పనుల చోట కూడా ఇదే పరిస్థితి

అధికారుల నిర్లక్ష్యం?

ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పీహెచ్‌సీలతోపాటు ఉపాధి హామీ పనుల వద్ద ప్రాథమిక వసతులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్లు ఏర్పాటుచేయాలని, తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఎండల ప్రభావంతో బాధపడే పేదల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 50 పీహెచ్‌సీలు ఉన్నా యి. ప్రతి పీహెచ్‌సీలోనూ రోజుకు 100 నుంచి 150 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఓపీల సంఖ్య పెరిగింది. వడదెబ్బ, జ్వరం కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. 12 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆస్పత్రికి వచ్చిన కేసులు 1191 ఉంటే క్షేత్రస్థాయిలో 6181 కేసులను గుర్తించారు. పీహెచ్‌సీల డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రైవేటు డాక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎండను తట్టుకునేందుకు ఓఆర్‌ఎస్‌ కార్నర్స్‌ను ఏర్పాటు చేసింది.

బాటిళ్లలో ఓఆర్‌ఎస్‌ ద్రావణం

జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్లు పూర్తిగా కనిపించకపోవడం గమనార్హం. మరికొన్ని చోట్ల పేరుకు ఏర్పాటుచేశారు. అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. కొన్ని కేంద్రాల్లో వాటర్‌ బాటిళ్లలో ఓఆర్‌ఎస్‌ ద్రావణం ఉంచి కార్నర్‌గా చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా ఏర్పాటు చేసిన కార్నర్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు ఓఆర్‌ఎస్‌ కార్నర్ల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి ఉపయోగంలోకి రావడం లేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదుపాయం లక్ష్యానికి విరుద్ధంగా మరుగునపడుతోంది.

కూలీలకు తప్పని అవస్థలు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. 40 డిగ్రీల ఎండలో పనిచేస్తున్న కూలీలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ పని చేసే ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో లేవు. దీంతో కూలీలు ఇళ్ల నుంచి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల తాగునీరు కూడా దూరంగా ఉండడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిత్తూరు, పూతలపట్టులో..

చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్‌పేట పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ అలంకారప్రాయంగా ఉంది. గుడిపాలలోని పీహెచ్‌సీ, బొమ్మసముద్రంలోని పీహెచ్‌సీలో కూడా కార్నర్స్‌ ఏర్పాటు చేసి గాలికొదిలేశారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కొరవడుతోంది. బంగారుపాళ్యం మండలంలో ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ను పక్కన పడేశారు. యాదమరి, పూతలపట్టు, ఐరాల, తవణంపల్లి మండలాల్లో షో చూపిస్తున్నారు. ఈ కార్నర్స్‌ రోగులు ఏమాత్రం ఉపయోగం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

తూతూమంత్రంగా..

కుప్పం: ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఓఆర్‌ఎస్‌ కార్నర్లు అలంకారప్రాయంగా మారాయి. కుప్పం నియోజకవర్గంలోని 12 పీహెచ్‌సీల్లో ఒక మూలన అట్ట బాక్సుల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎండల తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులను వివరించి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. ఎండదెబ్బకు గురైన వారికి మాత్రమే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇస్తున్నారు.

ఒక మూలన ఏర్పాటు

పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు ఏరియా ఆస్పత్రితోపాటు కొలమాసనపల్లి, గంగవరం మండలంలోని గంగవరం, పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలంలోని బైరెడ్డిపల్లి, తీర్థం, వి.కోట మండలంలో వి.కోట, ఓగు, పెద్దపంజాణి మండలంలో రాయలపేట, పెద్దపంజాణిలోని ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్లను ఒక మూలన ఏర్పాటుచేశారు. పీహెచ్‌సీల్లో రెడీమేడ్‌గా ఓఆర్‌ఎస్‌ బాటిళ్లు ఉంచారు. ఎండదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చిన వారితో ఆ నీటిని తాగిస్తున్నారు.

వైద్యశాఖ మార్గదర్శకాలు పాటించని సిబ్బంది

వైద్యశాఖ మార్గదర్శకాల ప్రకారం ఎండల తీవ్రత పెరిగే కాలంలో ప్రతి పీహెచ్‌సీలోనూ తప్పనిసరిగా ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ ఉండాలి. అంతేగాక తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచి ప్రజలకు తక్షణ సేవలు అందించాలి. జిల్లాలో అనేక పీహెచ్‌సీల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. చాలా వాటిల్లో కార్నర్లు ఉన్నా వినియోగంలో లేవు. కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి మూలనపడి పోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల ఆ ఊసే లేదు. శ్రీరంగరాజుపురం పీహెచ్‌సీ, అదే మండలంలోని అరిమాకులపల్లి పీహెచ్‌సీ, కార్వేటినగరంలోని కత్తెరపల్లి పీహెచ్‌సీ, బంగారుపాళ్యం పీహెచ్‌సీ, పెనుమూరు మండలాల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్స్‌ కనుమరుగయ్యాయి. అలాగే చిత్తూరు, నగరి, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని పలు పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్స్‌ దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement