రాజధాని నిర్మాణానికి రూ.లక్షల కోట్లు అవసరమా..? మావిగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి జయప్రకాష్ నారాయణ విమర్శలపై నారాయణస్వామి ధ్వజం
కార్వేటినగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌పై జయప్రకాష్ నారాయణ విమర్శలు సరికాదని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూ రు నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఆయన ఆది వారం పుత్తూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా లేని చోట చంద్రబాబు తమ సామాజికవర్గం అభివృద్ధి కోసం రూ.లక్షల కోట్లు వెచ్చించి రాజధాని నిర్మాణం చేస్తున్నాడని విమర్శించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ (మావిగన్)ను రాజధానిగా చేస్తే అంత ఖర్చు అవసరం లేదని తెలిపారు. వేల సంఖ్యలో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతాయని తెలిపారు. తద్వారా లక్షలాది మందికి జీవనోపాధి లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఓర్వలేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మేధా వుల ముసుగులో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. వారికి పేదల ప్రజల గురించి పట్టదన్నారు. ప్రజలకు మంచి జరిగే ఏ విషయమైనా వారికి కంటగింపుగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే జగనన్న తీసుకువచ్చిన మావిగన్ ప్రతిపాదనపై జయప్రకాష్ నారాయణ ప్రేలాపణలు ఉన్నా యని తెలిపారు. అందులో భాగంగానే జగనన్నను పిచ్చితుగ్లక్ అని సంభోదించాడన్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చితుగ్లక్ కాదని, కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం తపించే మానవతావాది అని వివరించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కులపిచ్చితో రగిలిపోతున్నారని తెలిపారు. వారు ఈ రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టమన్నారు. జగనన్న అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదించిన మావిగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పరిశ్రమలు రావడంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని అనేది ఒక్క చంద్రబాబు సామాజిక వర్గం వారి కల మాత్రమేనన్నారు. ఇది రాష్ట్ర ప్రజల కల కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబును ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.


