
రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మండిపడింది. సకాలంలో పునరావాసం కల్పించకపోతే నిర్వాసితుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జీవనోపాధిని పెంచేలా నిర్వాసితులకు పునరావాసం కల్పించడాన్ని అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని సిఫార్సు చేస్తూ పార్లమెంట్‌కు ఇటీవల స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
జలవనరుల విభాగంపై ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. ఈ ఏడాది జూన్ 8 నుంచి 11 వరకు పోలవరం ప్రాజెక్టు పనులు, పునరావాసం కల్పనను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దీనిపై పార్లమెంట్‌కు నివేదిక ఇచ్చింది.
12,797 కుటుంబాలకే పునరావాసం
పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1,06,006 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందుకోసం 213 పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా.. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్దేశించింది. వరదలు, సాంకేతిక సమస్యలు వస్తే.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పొడిగించింది. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే 38,060 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కానీ, జనవరి 8 నాటికి కేవలం 12,797 కుటుంబాలకే పునరావాసం కల్పించారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. పోలవరం నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను సమన్వయం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.
పనులను పర్యవేక్షిస్తున్న అధికారులకు వెంటనే ప్రాజెక్టు వద్ద క్వార్టర్స్ నిరి్మంచాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేలా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కమిటీని నియమించాలని సిఫార్సు చేసింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయపడింది.