బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. విజయవాడకు చెందిన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీవారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.
ఉండి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నర్సింహరాజు, అతని భార్య ఉదయశ్రీ (50) పెదపుల్లేరులో మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రతిష్టకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఉండి రైల్వే గేటు దాటిన వెంటనే వీరి ద్విచక్రవాహననాన్ని వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చుని ఉన్న ఉదయశ్రీ కింద పడిపోవడం, ఆమైపె నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ విడిచిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయశ్రీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ యెషయా కేసు నమోదు చేశారు.


