న్యూస్‌రీల్
లే అవుట్లకు తరలిపోతున్న మట్టి
అరకమ తవ్వకాలపై రైతుల ఆవేదన
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: జిల్లాలోని ప్రధాన డ్రెయిన్లలో నక్కల డ్రెయిన్ ఒకటి. ఆచంట, పాలకొల్లు, తదితర నియోజకవర్గాల మీదుగా సాగే ఈ డ్రెయిన్‌పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు నియోజకవర్గాలు వశిష్ట గోదావరి, సముద్ర తీరానికి దగ్గరగా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉండటంతో వరదలు, విపత్తుల సమయంలో ముంపు బెడద ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించేందుకు పూర్వం డ్రెయిన్ నక్కల డ్రెయిన్ గట్లను దాదాపు పది మీటర్లు వెడల్పున విశాలంగా అభివృద్ధి చేశారు. కొన్ని చోట్ల గట్ల వెడల్పు 15 మీటర్లకు పైనే ఉంటుంది. ఇప్పటికే ఆక్రమణలతో గట్లు కుచించుకుపోతుండగా అక్రమ తవ్వకాలతో ఇవి మరింత బలహీనంగా మారుతున్నాయి. యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టును పటిష్టం చేసే పేరిట గత ఏడాది ఆచంట మండలం ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్‌ను ఆనుకుని డ్రెయినేజీ శాఖకు చెందిన సుమారు ఐదెకరాల స్థలంలో రూ.కోటికి పైగా విలువైన మట్టి తవ్వకాలు చేసినట్టు అంచనా. ఏటిగట్టు పనుల ముసుగులో పాలకొల్లు, పరిసరాల్లో కొత్తగా వెలుస్తున్న లే అవుట్లు, మెరక పనుల కోసం ఈ మట్టిని తరలించేశారన్న ఆరోపణలున్నాయి. పరిమితులు పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేశారని అప్పట్లో రైతులు అధికారులకు ఫిర్యాదులు చేశారు.
తాజాగా ఆచంటతో పాటు ఆచంట వేమవరంలో నక్కల డ్రెయిన్‌లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కాలువలో పూడికతీత పేరిట రెండు వారాల క్రితం ఆచంట వేమవరం వద్ద డ్రెయిన్ గట్టును గుల్ల చేసేశారు. లోతుగా తవ్వేసి మట్టిని తరలించుకుపోవడంతో గట్టు ప్రమాదకరంగా మారింది. దీనిని గమనించిన స్థానిక రైతులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఆచంట వద్ద కొందరు వ్యక్తులు అక్రమ తవ్వకాలు చేయడాన్ని రైతులు అడ్డుకుని లారీలు, జేసీబీలను అధికారులకు అప్పగించారు. తవ్వకాలు చేసిన చోట ట్రాక్టర్ వెళ్లే దారి లేకుండా గట్టు కాలువలోకి జారిపోయి ప్రమాదభరితంగా తయారైందని రైతులు అంటున్నారు. గోతులు పూడ్చి పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు వీలుగా గట్టును సరిచేయాలని, అక్రమ తవ్వకాలు చేసిన వారిపై రికవరీకి చర్యలు తీసుకుని అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం మార్టేరులో జరిగిన కిసాన్ మేళాలో పార్టీలకు అతీతంగా రైతులు కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రం అందజేశారు.
పాలకొల్లు, పరిసరాల్లోని లే అవుట్లకు ఈ మట్టి తరలిపోతున్నట్టు తెలుస్తోంది. డ్రెయిన్ గట్టుకు తూట్లు పొడుస్తూ లక్షలాది రూపాయల మట్టిని కొల్లగొడుతున్నారు. కూటమి నేతల అండదండలతోనే తవ్వకాలు సాగుతుండటంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలతో గట్లు కృంగిపోయి బలహీన పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు, వరదల సమయంలో గండిపడి ముంపునకు గురయ్యే ప్రమాదముందని వారంటున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, గట్లను పటిష్టం చేయాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలు గూర్చి పాలకొల్లు డ్రెయినేజీ డీఈ సీహెచ్ మురళీకృష్ణను సంప్రదించగా ఆచంట వేమవరంలో మట్టి తవ్వకాలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆచంట వద్ద తవ్వకాలు జరుగకుండా సిబ్బందిని కాపలా పెట్టినట్టు తెలిపారు.
నక్కల డ్రెయిన్‌లో మట్టి తోడేళ్లు
ఆచంట వేమవరం, ఆచంటలో అక్రమ తవ్వకాలు
కూటమి నేతల కనుసన్నల్లో వ్యవహారం
పూడికతీత మాటున గట్లుకు తూట్లు
పాలకొల్లులో లేఅవుట్లకు రూ.లక్షలు విలువ చేసే మట్టి తరలింపు
ముంపు ముప్పుతో ఆందోళనలో రైతులు
చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతులు
ఆచంటలోని నక్కల కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు 2వ తేదీ గురువారం రాత్రి నుంచి జేసీబీలు, టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. శుక్రవారం విషయం తెలిసి రైతులమంతా అడ్డుకున్నాం. అప్పటికే 150 అడుగులు పొడవున, 50 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతున గట్టును తవ్వి మట్టి తరలించేశారు. అక్రమ తవ్వకాలతో గట్టు బలహీనపడింది. ఆగస్టు, సెప్టెంబరులో కురిసే భారీ వర్షాలు, గోదావరి వరదల సమయంలో గట్టుకు గండిపడితే పొలాలు ముంపునకు గురికావడంతో పాటు, ఈ భారీ గోతిలో ప్రమాదవశాత్తు మనుష్యులు, పశువులు పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గోతిని పూడ్చి గట్టును పటిష్టం చేయాలి. అక్రమ తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
రెండు రోజుల క్రితం మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగిన కిసాన్ మేళాలో నక్కల డ్రెయిన్‌లో అక్రమ తవ్వకాలపై ఆచంటకు చెందిన రైతుల ఆవేదన ఇది.


