● సాఫ్ట్‌వేర్ తయారు చేసిన వ్యక్తి ఏ–9 నిందితుడా?
● నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు జరపాలి
● డిమాండ్ చేస్తున్న హిందూ మత వాదులు
ద్వారకాతిరుమల: పెద్ద తిరుపతి తరువాత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం చిన తిరుపతి. అటువంటి క్షేత్రంలో గతనెల 15న బయటపడ్డ శ్రీవారి నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ సంచలనాన్ని రేకెత్తించింది. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకూడదని భక్తజన లోకం మొదటి నుంచి కోరింది. ఇంతవరకు జరిగిన ఈ కేసు దర్యాప్తుపై వస్తున్న ఆరోపణలు హిందూ మతవాదులను తీవ్రంగా కలచివేస్తోంది. ఆ దేవదేవుడికే న్యాయం జరగకపోతే.. ప్రజలకు చట్టాలపై నమ్మకం పోతుందని భక్తులు వాపోతున్నారు.
సాఫ్ట్‌వేర్ కట్టుకథ : కేసులో నిందితులుగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంఎన్‌వీఎస్ శ్రీనివాసరావు స్నేహితులు. రమేష్ కోరిన విధంగా శ్రీనివాసరావు సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు. శ్రీవారి దేవస్థానానికని చెప్పడంతో శ్రీనివాసరావు తమ వద్ద డబ్బులు తీసుకోకుండా సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇచ్చాడని రమేష్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అదే నిజమైతే డేటాబేస్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, లావాదేవీల లాగ్, ఆడిట్ నియంత్రణలు లేకుండా, డైనమిక్ క్యూఆర్ కోడ్ పెట్టి, దేవస్థానానికి ఏవిధమైన లెక్క తెలిసే వీలు లేకుండా, కేవలం టికెట్ మాత్రమే ప్రింట్ వచ్చేలా సాఫ్ట్‌వేర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటున్నారు. అసలు దేవస్థానం ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లెటర్ లేకుండా సాఫ్ట్‌వేర్ తయారు చేయడం, దాన్ని బయటకు ఇవ్వడం కూడా నేరమే. దీనిని పోలీసులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదో ఆ చిన వెంకన్నకే తెలియాలి.
ఏ9 నిందితుడా? ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఉండకపోతే ఈ టెక్నికల్ స్కాం జరిగేది కాదు. అలాంటి స్కామ్‌కు కారణమైన వ్యక్తిని పోలీసులు ఏ–9 నిందితుడిగా (ఆఖరిలో) చేర్చడం తమను విస్మయానికి గురిచేసిందని పలువురు భక్తులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లే దానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందా.. అన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
సీబీ సీఐడీకి అప్పగించాలి : కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఇప్పటికే మీడియాకు తెలిపారు. దాంతో ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న దేవాలయంలోని కీలకమైన వ్యక్తులు ఎవరైనా బయట పడతారా.. లేకపోతే పోలీసులు ఇంతటితో సరిపెడతారా.. అన్న చర్చకూడా క్షేత్రంలో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా జరపాలని, లేనిపక్షంలో సీబీ సీఐడీకి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి.


