ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య రథానికి చెక్క అశ్వాలను ఏర్పాటు చేసే పనులు శుక్రవారం రథశాలలో ప్రారంభమయ్యాయి. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో తయారు చేయించిన శ్రీవారి రథనికి అశ్వాలు లేవు. అవి లేకుండానే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఈ రథంలో రథోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో దేవదేవా శ్రీఅశ్వాలుశ్రీ లేవా? శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రథానికి అశ్వాలు ఏర్పాటు చేయించే పనులు చేపట్టారు. ఈనెల 26 న స్వామి వారి వైశాఖ మాస దివ్య బ్రహ్మత్సవాలు ప్రారంభం కానుండగా, వచ్చే నెల 1న రథోత్సవాన్ని జరపనున్నారు. ఉత్సవాలకు తక్కువ సమయం ఉండటంతో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి రథనికి ఉన్న అశ్వాలను తీసి, శ్రీవారి రథనికి ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కొత్త అశ్వాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ మే నెల 9న నిర్వహిస్తున్నామని 3వ అదనపు జిల్లా జడ్జి సంస్థ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అన్ని సివిల్ కేసులు, ప్రో నోటు బాకీ కేసులు, రాజీ చేసుకనే క్రిమినల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్, బీమా కేసులు, భార్యభర్తల వివాదాలు, మనోవర్తి కేసులు, గృహ హింస కేసులు, చెక్కు బాకీ కేసులు తదితర కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): అన్నమయ్య జిల్లాలో న్యాయవాది ఎల్లయ్యను దారుణంగా హత్య చేసిన ఘటనను ఖండిస్తూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపారు. విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.అప్పిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు జి.శేఖర్, కోశాధికారి డి.మహాలక్ష్మి, న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, సూర్యమణి ముఖర్జీ, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జనగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాలులో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు జన గణన 2027కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం గృహాల జాబితా ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
పట్టణంలోని పీపీ రోడ్డులో ఈవీఎంలు భద్రపరిచిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంను కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. గోదాములో ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను సమగ్రంగా పరిశీలించారు.
భీమవరం(ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు తనను వేధింపులకు గురిచేశాడని భీమవరానికి చెందిన ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


