భీమవరం (ప్రకాశంచౌక్): జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మెరుగైన సేవలు అందించగలరని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండటం వల్ల వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. పాత్రికేయులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి జర్నలిస్టు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు. 25 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఉచిత వైద్య శిబిర నిర్వహణలో సేవలందించిన వైద్యులకు కలెక్టర్ అభినందనలు తెలియజేసి సత్కరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్టేట్ చైర్మన్ సీహెచ్ కృష్ణంరాజు, ఒమిక్స్ నెక్స్‌ట్ జెన్ లేబరేటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్ముల మురళీకృష్ణ, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జి.గీతాభాయి, డీసీఎచ్‌ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, డీపీర్‌ఓ తలుపుల నాగేశ్వరరావు పాల్గొనగా.. వైద్యులు బి.ఐశ్వర్య, రఘువీర, ప్రియాంక, సూర్య లలిత, శ్వేత, శ్రీవిద్య, శిల్ప, స్రవంతి, నిరుపమ, ప్రియాంక, గోపీనాథ్, విజయానంద్, కిరణ్, వినయ్ కుమార్, శ్వేత తదితరులు వైద్య సేవలందించారు.


