ఏలూరు (టూటౌన్): శ్మశాన భూముల్లో చెరువులు తవ్వుతున్న భూస్వాములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కలిదిండి మండలం, పేదలంక పంచాయతీ పరిధి రామకృష్ణాపురం శివారు గ్రామాల్లో పేదల శ్మశాన భూమి పక్కనున్న భూస్వాములు చేపల చెరువు తవ్వడానికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కలిదిండి రెవెన్యూ శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ వెన్యూ అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. పేదల భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటూనే మరోపక్క పేదల ఉసురు తీస్తున్న పాలక ప్రభుత్వాలు పేదల శ్మశాన భూములను కూడా లాగేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు స్పందించి శ్మశాన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహంకాళిరావు, గంటా సుబ్రహ్మణ్యం, వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


