ఇద్దరు నిందితులకు స్పెషల్ ఆఫర్ ?
ఏలూరు టౌన్/ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో కీలకమైన నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించి, భారీ ఎత్తున అక్రమార్జన చేసినట్లు పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రూ.100, రూ.200 విలువైన నకిలీ టికెట్లను ముఖ్యంగా శని, ఆదివారాల్లో రద్దీ సమయంలో విక్రయిస్తూ భారీగా సొమ్ములు కాజేసినట్లు తెలిపారు. కీలక నిందితుడు దేవస్థానం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఐనంపూడి సాయి జగన్నాథరాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది సైతం నకిలీ టికెట్ల వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టం చేశౠరు. ఒక సాప్ట్‌వేర్ ఉద్యోగి సహాయంలో కంప్యూటర్, ప్రింటర్‌లను ఏర్పాటు చేయటమే కాకుండా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు విచారణలో తేలింది. పెన్‌డ్రైవ్‌లో సాఫ్ట్‌వేర్‌ను వేసుకుని అప్పటికప్పుడు నకిలీ టికెట్లు ప్రింట్ తీస్తూ అవినీతికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ రూ.100ల టికెట్లు వంద, రూ.200 టికెట్లు వంద చొప్పున భక్తులకు విక్రయిస్తూ సొమ్మును కాజేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ నకిలీ వ్యవహారంపై దేవస్థానం ఈఓ భద్రాజీ ఫిర్యాదుతో ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కీలక నిందితుల అరెస్ట్
నకిలీ టికెట్ల వ్యవహారంలో ఏడుగురు కీలక నిందితులను ద్వారకాతిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఏ3 సముద్రాల శేషుబాబు, ఏ4 మేక సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితుడు ద్వారకాతిరుమలకు చెందిన ఐనంపూడి సాయి జగన్నాథరాజు, ములగాల రమేష్, తొంటపాక సత్యనారాయణ, దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాస్, కొమ్మర గ్రామానికి చెందిన కీర్తి అశోక్‌కుమార్, మానుకొండ ఆంజనేయులు, ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన ముత్యాల నాగవెంకట సత్యశ్రీనివాసరావును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వీరివద్ద రూ.200 విలువైన 61 నకిలీ టికెట్లు, టికెట్ల ముద్రణకు వినియోగించే ల్యాప్‌ట్యాప్, థర్మల్ ప్రింటర్, 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై లోతైన విచారణ చేస్తున్నామనీ, ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందనీ, రెగ్యులర్ ఉద్యోగులు ఏమైనా దీనిలో భాగస్వాములు అయ్యారా? అనేది విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఈ నకిలీ టికెట్ల కేసు దర్యాప్తులో ప్రతిభ చాటుకున్న భీమడోలు సీఐ పీ.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్స్ జి.ధర్మరాజు, టి.లక్ష్మీనారాయణ, హోంగార్డు వీజే ప్రకాష్‌బాబును జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులకు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఓ నిందితుడు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ తయారు చేసింది మీరేనని కోర్టులో ఒప్పుకుంటే రూ. 10 లక్షలు ఇస్తానని అతడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ ఆఫర్‌ను ఇద్దరు నిందితులు ఒప్పుకోలేదు. అయినా పట్టువిడవకుండా రాత్రి వరకు తమ ప్రయత్నాలు సాగించడం విశేషం..
అలా ఎలా తయారు చేశారు..?
నకిలీ టికెట్ల స్కామ్‌కు వినియోగించిన సాఫ్ట్‌వేర్‌ను బయట వ్యక్తులు ఇష్టానుసారంగా ఎలా తయారు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి, కమిషనర్ స్థాయి అధికారులు ఆర్డర్ కాపీ ద్వారా అనుమతిస్తేనే గానీ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయకూడదు. కానీ తన స్నేహితుడు రమేష్ అడిగాడని ఉంగుటూరు మండలం, ఉప్పాకపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎమ్‌ఎన్‌వీఎస్ శ్రీనివాసరావు దేవస్థానం టికెట్ల సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసేశాడు. ఇదిలా ఉంటే సాఫ్ట్‌వేర్ తయారు చేసినందుకు శ్రీనివాసరావును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏ9 (ఆఖరి) నిందితుడిగా చేర్చారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ తప్పు కారణంగా నకిలీ టికెట్ల జారీ యథేచ్ఛగా సాగిపోయింది.


