భీమవరం (ప్రకాశంచౌక్): గుంటూరులో ఇటీవల నిర్వహించిన చెరుకూరి వోల్గా– లెనిన్ మెమోరియల్ అండర్ 15 నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ విభాగంలో జిల్లా ఆర్చర్లు పతకాలు గెలుచుకున్నారు. మాగాపు సుహాస్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించాడని ఆర్చరీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జయరాజు గురువారం విలేకరులకు తెలిపారు. మిక్సిడ్ విభాగంలో అల్లూరు కనిష్కతో సిల్వర్ మెడల్, బాలుర విభాగంలో బ్రాంజ్ మెడల్‌ను కై వసం చేసుకున్నాడన్నారు. అల్లూరు కనిష్క, కలిదిండి హేమశ్రీ కాంపౌండ్ గర్‌ల్స్ టీమ్ సిల్వర్ మెడల్ సాధించిందని తెలిపారు. మెడల్స్ సాధించిన ఆర్చర్లను, కోచ్ సాహిత్‌ను పలువురు అభినందించారు.
టి.నరసాపురం: ప్రభుత్వం నిషేధించిన కలుపు మందు గ్లైసెల్ 360 లీటర్లను వ్యవసాయ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌కే హబీబ్ మాట్లాడుతూ మండలంలోని గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన రైతు కె.నాగేశ్వరావుకు చెందిన ఆయిల్ పామ్ తోటలో ఉన్న షెడ్డులో నిషేధిత గ్లైసెల్ కలుపు మందు అక్రమ నిల్వలు ఉన్నాయని సమాచారం వచ్చిందన్నారు. దీంతో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రియాంక, చింతలపూడి ఎడిఎ సుబ్బారావుతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో 360 లీటర్ల గ్లైసెల్ బాటిళ్లు గుర్తించి, వీవీఆర్‌ఓ సమక్షంలో ఆ మందులను స్వాధీనం చేసుకుని రైతుపై 6ఏ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. పురుగుమందుల నియంత్రణ చట్టం 1968, జీవో నెంబర్ 649ప్రకారం గ్లైసెల్ 41 శాతం కలుపు మందును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తయారీ వినియోగం నిషేధించాయన్నారు. గ్లైసెల్ క్రయ విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఆ మందును కొన్నా అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యలమంచిలి: మండలంలోని ఆర్యపేట గ్రామానికి చెందిన కవల లక్ష్మీ కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమె గత నాలుగేళ్లుగా కువైట్‌లోని ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్థానిక భారతీయులు, ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని కార్గో విమానంలో శుక్రవారం భారతదేశం తీసుకువస్తున్నారు.


