ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాపుల రక్షణ కోసం శిలువుపై ప్రాణత్యాగం చేసి క్రీస్తు చూపిన బాటలో పయనించాలని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు, ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల క్రైస్తవ సంఘాలు, దైవ సేవకులు, నాయకులు, విశ్వాసుల ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో రన్ ఫర్ జీసెస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని జయరావు, ఎమ్మెల్యే చంటి, బిషప్ జాన్ ఎస్‌డీ రాజు, బిషప్ ఎం ఏలీషా రాజు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జయరావు మాట్లాడుతూ మనిషి త్యాగాల ద్వారా మానవ సమాజానికి సేవ చేయవచ్చన్నారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్రీస్తు స్ఫూర్తితో ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం వంటి సద్గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం యుద్ధం ఆగిపోయి శాంతి, సామరస్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అప్పలనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్నేపల్లి తిరుపతి, హెన్రీ డొమినిక్, ఫాదర్ మైకేల్ ఇంజమాల, బీరపోగు యోహాన్, టి.శ్యాంబాబు, పీవీ రాజు, బేతాళ సతీష్ బాబు, ఫాదర్ బాల, పాస్టర్ పి.జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


