మరో రెండు తడులు మాత్రమే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 0.442 టీఎంసీలే..
● కుడి, ఎడమ కాల్వల పరిధి 35 వేల ఎకరాల వరి సాగు
● ఈ నెల 15 వరకు నీటి సరఫరా
● వేసవిలో తాగునీటి అవసరాలకు
అర టీఎంసీ అవసరం
● మరోసారి కర్ణాటకను
ఆశ్రయించాల్సిన పరిస్థితి
–8లో u
అమరచింత/గద్వాల: కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరులోని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు అందరి అవసరాలు తీర్చే పెద్దన్నే.. మరొకరి సాయం కోరే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 0.44 టీఎంసీలు, ఎంబీ, ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉంది. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ పరిధిలో అధికారికంగా 25 వేల ఎకరాలు సాగు చేయగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం 35 వేల ఎకరాలకు ఈనెలాఖరు వరకు సాగునీరు అవసరం కాగా ఇప్పటికే పంటలకు వారబంధీ విధానంలో.. కుడి ప్రధాన కాల్వ ద్వారా 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వేసవిలో తాగునీటి కోసం మూడునెలలపాటు అర టీఎంసీ అవసరం. ప్రస్తుతం జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు తీర్చడం గగనమే. దీంతో తాగునీటి అవసరాలను తీర్చేందుకు మరోసారి కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడ్సాలిన పరిస్థితి నెలకొంది.
మార్చి చివరి నుంచే..
జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. వానాకాలంలో ఈ ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్, రామన్‌పాడు ప్రాజెక్టుల పరిధిలో సుమారు 7 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. అయితే ఈసారి వేసవి మొదలైన మార్చి చివరాఖరు నుంచే జలాశయంలో నీటినిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎగువనున్న కర్ణాటక నుంచి జలాశయానికి ఇన్‌ఫ్లో లేకపోవడం, కుడి, ఎడమ కాల్వల పరిధిలోని సాగైన పంటలకు సాగునీటిని అందిస్తుండడం, లీకేజీలతో పాటు ఎండలకు ఆవిరి అవుతుండటంతో నీటినిల్వలు వేగంగా పడిపోవడానికి కారణమవుతున్నాయి.
35 వేల ఎకరాలు సాగు..
జూరాల ప్రాజెక్టు పరిధిలో వానాకాలంలో 1.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుండగా.. రబీ సీజన్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎడమ కాల్వ చివరి ఆయకట్టు పరిధిలోని సాగుచేసే సుమారు 50 వేల ఎకరాలకు ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించి కేవలం 10 వేల ఎకరాలకు మాత్రమే వదులుతుంది. ఇక కుడి ప్రధాన కాల్వ పరిధిలో 37 వేల ఎకరాలు సాగైతే రబీలో మాత్రం కేవలం 15 వేల ఎకరాలకు కుదించారు. అయితే అధికారికంగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. అనధికారికంగా మరో 10 వేల ఎకరాల వరకు రైతులు పంటలు సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే ఈ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే వారబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. కుడికాలువ పరిధిలో 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఎడమ, సమాంతర కాల్వలకు మాత్రం నీటిని పూర్తిగా నిలిపివేశారు.
కుడి, ఎడమ కాల్వల పరిధిలో పంటలు సాగుచేసిన రైతులు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే ఈ నెల 20–25 తేదీల వరకై నా నీరు అందించాలని కోరుతున్నారు. కానీ, అధికారులు మాత్రం ఈ నెల 15 వరకే నీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తర్వాత మరో పదిరోజులపాటు పంటలకు నీటిని ఎలా అందించాలా అని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. రూ.500 బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు మొత్తం వరిపంట సాగుచేశారు.
తాగునీటికి ఎలా..
వేసవిలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు అర టీఎంసీ వరకు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఎంబీ ఎండీడీఎల్ స్థాయిలో 1.486 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. లైవ్‌లో 0.442 టీంఎసీలు మాత్రమే ఉంది. దీంతో సాగు, తాగునీటి లెక్కలు వేసుకుంటే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఏమాత్రం సరిపోవు. దీంతో మరోసారి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తుంది. కర్ణాటక కనీసం 2 టీఎంసీలు విడుదల చేస్తే కానీ.. తాగునీటి గండం నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులకు మరో రెండు తడులు మాత్రమే నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాల రైతులు మాత్రం తమకు 5 తడులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రస్తుతం వారబంధి విధానంలో నాలుగు రోజులకుగాను కేవలం 3 రోజుల పాటు సాగునీటిని వదులుతున్నాం.
– చెన్నకేశవరెడ్డి, డీఈ,
నందిమళ్ల డివిజన్, జూరాల ప్రాజెక్లు
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి,
ఎమ్మెల్యే, గద్వాల


