బెదిరింపులకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులకు భయపడేది లేదు

Apr 11 2026 10:04 AM | Updated on Apr 11 2026 10:04 AM

చెరువుకట్టపై ఉద్రిక్తత..

కేంద్ర నిధులు వాడుకుంటూ విమర్శలా?

మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

అమరచింత: కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధితో పాటు చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు చేసిందని.. వాటిని వినియోగించుకుంటూ తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకె అరుణ అన్నారు. పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు మంజూరు చేసిందని.. పుర ఎన్నికల వేళ మంత్రి వాకిటి శ్రీహరి హడావుడిగా శంకుస్థాపన చేయడం తనను అవమానించడమేనని తెలిపారు. శుక్రవారం ఆమె పట్టణంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేసేందుకు రాగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాటలు, మాటల యుద్ధం కొనసాగింది. వీటన్నింటిని లెక్క చేయకుండా ఎంపీ కాంగ్రెస్‌ నాయకులను తోసుకుంటూ చెరువుకట్టపైకి చేరుకొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎస్‌ఐ స్వాతి సిబ్బందితో కాంగ్రెస్‌ నాయకులను బయటకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి హూందాతనం మరిచి అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంపీగా రాజకీయాల్లో ఉన్నానని.. బాధ్యతలు, గౌరవం, ప్రొటోకాల్‌ తనకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలు కేంద్ర నిధుల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని.. నిజమైన పేదలకు కాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేయడం దారుణమన్నారు. ప్రజల పన్నులతో చేసే ప్రతి అభివృద్ధి పనికి ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించాలని సూచించారు. భూమిపూజ కోసం వస్తే కొందరు గుండాలకు మద్యం తాగించి అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు.

పోలీసుల వైఫల్యమే..

ఇక్కడ జరిగిన ఘటనకు పోలీసులే నైతికంగా బాధ్యత వహించాలని, వారి అసమర్థతతోనే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారని ఎంపీ ఆరోపించారు. ముందస్తు షెడ్యూల్‌ ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తనను అడ్డుకొనేందుకే పోలీసులు కాంగ్రెస్‌ వారికి సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దచెరువు కట్ట వద్ద కాంగ్రెస్‌ శ్రేణులను నిలువరిస్తున్న ఎస్‌ఐ స్వాతి, సిబ్బంది

అమరచింత పెద్దచెరువు కట్టపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాడుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ తమ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండయ్య, బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, మహకాళి శ్రీనివాసులు, మేర్వ రాజు, మంగ లావణ్య. మల్లారెడ్డి, విష్ణు, ఊషన్న, క్యామ భాస్కర్‌, మరాఠి అశోక్‌, నరాల నారాయణ, దుబాయి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement