వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ విద్యలో 2026–27 విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సు అందుబాటులోకి రానుందని డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూప్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి అందుబాటులో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏసీఈ గ్రూప్‌ను నిర్వహించాలనుకునే కళాశాలల యాజమాన్యాలు వెంటనే ఇంటర్‌బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కొత్త గ్రూప్ గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రవేశాల సమయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రెండు సెషన్‌లలో కొనసాగుతుందని.. 6వ తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికార వెబ్‌సైట్ www.tfmr. telangana.gov.in నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
రైతుల సహకారం
అభినందనీయం
కొత్తకోట రూరల్: మామిడి ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పే బాధ్యత రైతులే స్వీకరించాలని నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలో ఉన్న ఓ మామిడి తోటలో మొదటి కాయ కోసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నాబార్డ్, రాంకీ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని గిరిజన గ్రామాల్లో 450 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేయడం సంతోషకరమని రాంకీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అన్నారు. కార్యక్రమంలో భాగంగా రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సామాజిక బాధ్యతలో భాగంగా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పొందేందుకు పేద మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయర్లు అందించారు. కార్యక్రమంలో నాబార్డ్ సిబ్బంది, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
సృజనాత్మకతతో
ఆలోచించాలి: వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త స్టార్టప్‌లను ప్రారంభించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం యూనివర్సిటీలోని ఎంబీఏ, మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఎంబీఏ లాంటి డిపార్ట్‌మెంట్‌లలో చదివిన విద్యార్థులు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో సులువుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ సెక్టార్‌లలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ రమేష్‌బాబులు, కృష్ణయ్య, అర్జున్‌కుమార్ పాల్గొన్నారు.


