ఖిల్లాఘనపురం: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం చేసిన తర్వాత కేటాయించిన మిల్లులకే లారీల్లో తరలించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అఽఽధికారి విశ్వనాథం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో 2025–26 యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి మండలస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డీఎం ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి మల్లయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఎత్తు ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. తేమశాతం, ధాన్యంలో చెత్తా, మట్టి లేకుండా చూసుకోవాలని.. ప్రజాప్రతినిధులు, బంధువులు చెప్పారని తప్పుడు తూకాలు, తేమశాతం పంపితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ట్రక్‌షీట్ రాయడం, గన్నీ బ్యాగులు అందించడం సకాలంలో జరిగేలా చూడాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు అవసరమైన రైతులకు టోకన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఆనంద్, ఏపీఎం నాగరాజు, సీఈఓ కృష్ణ, వివిధ గ్రామాల ఏఈఓలు, కేంద్రాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
గోపాల్‌పేట: యాసంగి సీజన్ వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో అన్ని గ్రామాల పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్నరకం గుర్తింపు, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. కొనుగోలు, రవాణా, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


