యాసంగిలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలోని 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. వారంలో 4 రోజుల పాటు పంట కాల్వలకు సాగునీటిని అందించి మిగిలిన 3 రోజులు నిలిపివేసేవారు. అయితే ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా తగ్గడంతో వారంలో కేవలం 3 రోజులు.. అది కూడా రోజుకు 650 క్యూసెక్కుల నీటిని కాల్వకు వదులుతుండటంతో ఆత్మకూర్ మండలంలోని చివరి ఆయకట్టు గ్రామాలైన రేచింతల, వీరరాఘవాపురం రైతులకు సాగునీరు అందడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా వారబంది విధానంలో కూడా కోత విధించి సాగునీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. కాల్వ వెంట ఉన్న గ్రామాలకు మాత్రమే సాగునీరు అందుతుండటంతో అమరచింత మండలంలోని ఎత్తిపోతల పథకాలు క్రాప్ హలీడేను ప్రకటించాయి.


