
‘హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని’ కమిషనర్ ఏవీ రంగనాథ్ పునరుద్ఘాటించారు. హైడ్రా విజన్ అండ్ ఎజెండా అనే అంశంపై ‘ఎక్స్’ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశ–విదేశాల నుంచి అనేక మంది అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రంగనాథ్ వెల్లడించిన అంశాల్లో కీలకమైనవి ఇలా...
👉హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ చేయగా ప్రస్తుతం 45 మంది సిబ్బందే ఉన్నారు. వీరికి అదనంగా రెండు వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు 20 వేల దాటాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిబ్బందిని పెంచడంపై దృష్టి పెట్టింది.
👉రానున్న రోజుల్లో హైడ్రా ప్రభావం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఇప్పటికే ప్రజలు మాపై నమ్మకం పెంచుకుంటున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారులు తెల్లవారుజాము నుంచే ఎదురుచూస్తుండటమే దీనికి నిదర్శనం. బాధితుల కోసం త్వరలోనే ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.
👉నిజాంపేటలో దాదాపు కిలోమీటరు పరిధిలో రోడ్డు పక్కన ఇళ్లు వేసుకున్న కొందరు ఇంటి ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 30 అడుగుల రోడ్డు 10 నుంచి 15 అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా దాదాపు పది కాలనీలకు చెందిన వాళ్లు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాటిని తొలగించాం.
👉హైడ్రా ఏర్పాటైన తర్వాత ఏడాదిలో ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించగలిగాం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, చెరువుల్లో భూములు ఉన్నట్లు అనుమానిస్తే వాళ్లు సరిచూసుకుంటున్నారు. కొనేవాళ్లు లేకపోతే అమ్మే వాళ్లు, ఆక్రమించే వాళ్లు తగ్గిపోతారు. కొన్నిసార్లు కిందిస్థాయి వాళ్లు చేసిన చిన్నచిన్న పొరపాట్లను భూతద్దంలో చూపిస్తూ వ్యవస్థ పైన బురదజల్లే ప్రయత్నాలు జరిగాయి. మూసీలో జరిగే కూలి్చవేతల్నీ హైడ్రాకు ఆపాదించారు.
👉నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో చెరువుల చుట్టూ ఉన్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్‌లెట్ నాలాలు పూడ్చివేయడమే దీనికి కారణం. ఫలితంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. సాంకేతికంగా నగరంలో ఉన్న అన్ని చెరువుల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రతి దానికీ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నాం.
👉ఎన్నారైలు ఎవరైనా ఇక్కడ భూమిపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తే హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ ద్వారా ఎఫ్‌టీఎల్, బఫర్‌లు ప్రస్తుతం తెలుసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఈ అంశాలను సాధారణ భాషలో అందుబాటులోకి తీసుకువచ్చారు. హైడ్రా కూడా ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తోంది. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పని చేస్తున్నాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల్ని క్రోడీకరించి, శాటిలైట్ డేటాతో పాటు 2006 నాటి మ్యాప్‌లు సేకరించి ‘3డీ’ మోడల్‌లో తయారు చేస్తున్నాం. ఇది 15 సెంటీమీటర్ల రిజల్యూషన్‌లో అందుబాటులోకి వస్తుంది.
👉ప్రస్తుతం నగరంలో ఆరు చెరువులను పునరుద్ధరించనున్నాం. వీటిలో ఉన్న ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లలేదు. వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన షెడ్డులు మాత్రమే తొలగిస్తున్నాం. ఇటీవల సున్నం చెరువులోనూ అక్రమ బోర్ల పైనే చర్యలు తీసుకున్నాం.
👉హైడ్రా ఏర్పాటుకు ముందు నాటి కట్టడాల్లో నివాసాల జోలికి వెళ్లం. ఇవి అనుమతి తీసుకుని కట్టినా.. అనుమతి తీసుకోకుండా కట్టినా వాటిని కూల్చం. ఇదే విషయాన్ని పదేపదే స్పష్టం చేస్తున్నాం. చెరువులకు గతంలో ఫెన్సింగ్స్ వేసినా కూలగొట్టి ఆక్రమించారు. ఈ నేపథ్యంలోనే ప్రజ ల్లో అవగాహన కల్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. పార్కుల్లో ఆక్రమణలు తొలగించినప్పుడు ఫెన్సింగ్ వేసి, బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.