
బ్రహ్మోస్ క్షిపణితో పాక్‌పై విజయం
● సాంకేతిక పురోగాభివృద్ధి
అంశాలపై అవగాహన సదస్సు
● డీఆర్డీఓ మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుడు డాక్టర్ జి.సతీష్‌రెడ్డి
నెల్లూరు (బారకాసు): బ్రహ్మోస్ క్షిపణిని రష్యాతో కలిసి తయారు చేశామని, బ్రహ్మోస్‌లో సొంతంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఉందని, బ్రహ్మోస్ క్షిపణితో పాక్‌పై విజయం సాధించామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి తెలియజేశారు. భారతదేశంలో క్షిపణులకు అబ్దుల్ కలాం ఆధ్యుడని, ఈ నెల అక్టోబర్ 15న ఆయన జయంతి వేడుకలను అన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని సతీష్‌రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం నగర పాలక సంస్థ పరిధిలోని 23 మున్సిపల్ పాఠశాలల పదో తరగతి విద్యార్థుల శాస్త్ర సాంకేతిక పురోగాభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలోని చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాల చదివారని, విద్యతోనే గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తాను కూడా గవర్నమెంట్ స్కూల్ మహిమలూరు పాఠశాల, వీఆర్ కాలేజీలో చదివానని, అబ్దుల్ కలాం వేసిన బీజం వల్ల ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని విద్యార్థులకు వివరించారు. స్వదేశీ ఆలోచనలతో రూపొందించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆయుధాలతో భారత్ వివిధ యుద్ధాలలో గొప్ప విజయం సాధించిందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి రాత్రింబవళ్లు కష్టపడి చదవాలని, స్కూల్‌కు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, డిప్యూటీ డీఈఓ నాయక్, నెల్లూరు అర్బన్ ఎంఈఓలు తిరపాల్, హమీద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.