
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
● నకిలీ మద్యంతో
రూ.వేల కోట్లు దోచేశారు
● ప్రభుత్వ పెద్దల అండతోనే మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత
● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి నిరసన
నెల్లూరు (క్రైమ్): రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేస్తానన్న చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. బుధవారం బీవీనగర్‌లోని ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సూత్ర, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. కాకాణి పూజిత మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. 24 గంటలు మద్యం దొరుకుతుండడంతో నేరాలు పెరిగాయని, ప్రధానంగా మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారన్నారు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందన్నారు. వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి ప్రభుత్వం పారదర్శక విధానంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించిందని, జగనన్న ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందించిందనీ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి బెల్టు షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపట్టింద న్నారు. ఇంత పారదర్శకంగా జరిగినా మద్యం విధా నంలో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపిందన్నారు. లేని మద్యం స్కామ్‌ను సృష్టించిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో నకిలీ మద్యం స్కామ్‌కు తెర తీశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండలేకపోతే.. ఈ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి యథేచ్ఛగా విక్రయాలు చేసేవా రా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఎకై ్సజ్ అధికారుల పాత్రపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి పాలనలో ప్రతి నాలుగు బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ ఉంటోందని ఆరోపించారు. ప్రతి నిత్యం ఎకై ్సజ్ దాడుల్లో వేలకొలది నకిలీ మద్యం బాటిళ్లు గుర్తిస్తున్నారని, మాఫియాకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నకిలీ మద్యం తయా రీపై ఉక్కు పాదం మోపాలని, తయారీదారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోనూ నకిలీ మద్యంతో మరణాలు సంభవించాయని, వీటిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.