
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం
● మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయకేతనం ఎగుర వేసేందుకు క్యాడర్ సమాయత్తం కావాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ కుయుక్తలు, కుతంత్రాలు, కుట్రలతో స్థానిక ఎన్నికల్లో నెగ్గే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. అధికార కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుటికే వ్యతిరేకత పెరుగుతున్నందున, మనకు సానుకూలంగా ఓటర్లను మలచుకోవాలన్నారు. నియోజకవర్గంలో మన పార్టీ బలంగా ఉన్నందున అందరూ కలిసి పనిచేస్తే విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇబ్బంది పెట్టిన వారికి అసలు, వడ్డీతో చెల్లిస్తామని స్పష్టం చేశారు. తప్పడు కేసులు పెట్టే పోలీసులు, ఇబ్బంది పెట్టే అధికారులును, టీడీపీ నేతల వివరాలు యూప్‌లో నమోదు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఈ కమిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండా రాజగోపాల్‌రెడ్డి, అక్కి భాస్కర్‌రెడ్ఢి, ఎం.తిరుపతి నాయుడు, చెన్నకేశవులు, తిరుపతిరెడ్డి, సలీమ్, దస్తగిరి అహ్మద్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.