
మహోన్నతుడు మహర్షి వాల్మీకి
● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు
నెల్లూరురూరల్: భారతీయ సంస్కృతి, నీతి, ధర్మం, సత్యం, కరుణ వంటి విలువలతో కూడిన అత్యద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతుడు మహర్షి వాల్మీకి అని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అధికారులు, బీసీ సంఘాల నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ వాల్మీకి జీవిత విశేషాలను వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవుడి జీవన విధానానికి, ధర్మపాలనకు నిలువెత్తు సాక్షాత్కారం రామాయణమని, 23 వేల శ్లోకాలతో, ఏడు ఖండాలతో రామాయణ పవిత్ర మహాకావ్యాన్ని మనకు అందించిన గొప్ప మహర్షి వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సాధారణ మనిషి నుంచి ఒక మహా ఋషిగా ఎదిగి, మనుషులు మహా ఋషులవుతారని నిరూపించిన వాల్మీకి జీవిత చరిత్ర ఒక ఉదాహరణ అన్నారు. బీసీ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు నగరంలో బీసీ భవన్ పూర్తి చేసేందుకు కషి చేస్తామని చెప్పారు. నగరంలో వాల్మీకి మహర్షి విగ్రహం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు మొదలైన బీసీ సంఘాల నేతలు సూచించిన పలు సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు నల్లబోతుల వెంకటేశ్వర్లు, దేవరాల సుబ్రహ్మణ్యం, బీసీ కోటయ్య, జనార్దన్, కాలేషా, బుధవారపు బాలాజీ, పీఎల్ రావు, మురళీకృష్ణ, వసతిగృహ సంక్షేమ అధికారులు, పలు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.