
రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు
● ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను అడ్డుకున్న పోలీసులు
● ప్రభుత్వం, పోలీసులకు ఎందుకు
ఉలికిపాటు అంటూ నిలదీత
నెల్లూరు (పొగతోట): తమ న్యాయమైన డిమాండ్లతోపాటు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ, నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలో పురమందిరంలో (టౌన్‌హాల్) ఆత్మగౌరవ సభ జరగనీయకుండా భారీగా మోహరించిన పోలీసులు ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ, కలెక్టర్ బంగ్లాల వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరినా నిరాకరించారు. ర్యాలీకి అనుమతి లేదని, ఐదుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులు మండుటెండలో మట్టి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. గంటల తరబడి ఎండలో ఉండడం, కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వీలు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, నాయకులను ఎటు వైపు కదలనీయకుండా ఉగ్రవాదులను, తీవ్రవాదులను, రౌడీమూకలను, సంఘవిద్రోహ శక్తులను కట్టడి చేసినట్లు కట్టడి చేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేలపై కూర్చొని నిరసన కొనసాగిస్తూ పోలీసుల వైఖరి, జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నేతల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వంతోపాటు పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తమ నిరసన కార్యక్రమాలపై ఎందుకు ఉలికిపడుతుందని నిలదీశారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు, ప్రొబేషన్ కాలంలో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రొబేషన్ డిక్లరేషన్, 9 నెలలు ఆలస్యంగా చేసినందున, తొమ్మిది నెలల బకాయిలు, 6 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగోన్నతుల కల్పించాలని, అడ్వాన్స్ ఆటోమేటిక్ స్కీమ్ ద్వారా అదనపు ఇంక్రిమెంట్, సీనియారిటీ జాబితా, నిర్దిష్టమైన జాబ్ చార్ట్, అంతర్ జిల్లాల బదిలీలు, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కల్పించాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ జేఏసీ నాయకులు మధుబాబు, జగదీష్, హరీష్, పాండు, సురేంద్ర, బాలాజీనాయక్, శ్రీనివాసులురెడ్డి, సతీష్‌రెడ్డి, బాలాజీనాయక్, జయశ్రీ, మేఘన, సురేంద్ర, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ర్యాలీకి అనుమతించకపోవడం శోచనీయం
– పాండు, నెల్లూరు జేఏసీ నేత
ఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణం
– రజని, సచివాలయ ఉద్యోగి
ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది
– బి.మధుబాబు, జేఏసీ చైర్మన్
ఉద్యోగుల ఐక్యత ఏమిటో నిరూపిస్తాం
– పిల్లి హరీష్. జేఏసీ ప్లానింగ్ సెక్రటరీ
పోలీసుల తీరుతో ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది. సభకు అనుమతించి తర్వాత నిరాకరించడం ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చేశాయి. సచివాలయ ఉద్యోగులందరూ రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా ముందుకు సాగుతాం. సచివాలయ ఉద్యోగుల ఐక్యతేమిటే రాష్ట్ర ప్రభుత్వానికి చాటి చెబుతాం. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన కోసం జేఏసీ నిరంతరం శ్రమిస్తోంది.
ఉద్యోగుల సమస్యల సాధన కోసం అన్ని జిల్లాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లో సభకు అనుమతి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు సభను అడ్డుకోవడం దుర్మార్గం. ముందుగా అనుమతి ఇచ్చి సభ నిర్వహణ సమయంలో ఉద్యోగులను టౌన్‌హాల్ నుంచి బయటకు పంపించి, గేట్లకు తాళాలు వేయడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి తీరు ఎక్కడా చూడలేదు.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు ముందుగా పోలీసుల అనుమతి కోరాం. తొలుత అనుమతిచ్చినప్పటికీ తర్వాత నిరాకరించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఉద్యోగులను మండుటెండలో రోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గం. తమ సమస్యలను అధికారులకు చెప్పుకొనేందుకు ర్యాలీ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం. పోలీసుల తీరు దారుణం.
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 17 సర్వేలు నిర్వహించాం. ఇంటింటా సర్వే పేరుతో రోజూ ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగాల్సివస్తోంది. అతి తక్కువ వేతనాలతో ప్రజలకు సేవలందిస్తున్నాం.

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు