
విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులూ జాగ్రత్త
తోటపల్లిగూడూరు: ‘టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంటే.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే విధంగా విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉంటే మంచిది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటో మీ ఊహకే వదిలేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన సౌత్‌ఆములూరు వైఎస్సార్‌సీపీ నేత వేముల శ్రీనివాసులును ఆదివారం కాకాణి పరామర్శించారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికార మదంతో కక్ష సాధింపు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. శాంతిభద్రతలను నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ మరింత దిగజారిపోతున్నారని విమర్శించారు. రౌడీషీటర్లు మితి మీరి ప్రవర్తిస్తూ సామాన్యులపై, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులను ముమ్మరం చేశారన్నారు. టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహలేని స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్త వేముల శ్రీనువాసులు చేత పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని దాడి చేసిన వారిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, దాడి గురైన వ్యక్తిపై అట్రాసిటీ కేసులు బనాయించడం ఎంత వరకు సబబన్నారు. వైఎస్సార్‌సీపీలో బలంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను పోలీసులతో ఏదో విధంగా భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. అధికారం ఉందని విర్రవీగే టీడీపీ నాయకులకు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసులు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదని వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించిన టీడీపీ నాయకులు కావచ్చూ, అధికారులు కావచ్చూ పడే పాట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే వారి ఊహకు కూడా అందని విధంగా ఉంటాయన్నారు. జగనన్న చెప్పిన విధంగా తప్పు చేసిన అధికారులు, బదిలీ అయినా, పదవీ విరమణ చేసినా, సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కోని వచ్చి శిక్ష విధించడం ఖాయమన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే డిజిటల్ బుక్‌లో నమోదైన ప్రతి ఒక్కరిపై విచారణ చేసి అన్యాయం చేసిన వారిని, అందుకు సహకరించిన అధికారులకు కచ్చితంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఇప్పటికై నా ఎస్పీ జిల్లాలో అమాయకులపై జరుగుతున్న దాడులపై పక్షపాత వైఖరితో కాకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ కష్టకాలంలో జెండాను భుజాన మోసిన సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మద్దెన వెంకట సుబ్బానాయుడును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుఽధీర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, మండల ఉపాధ్యక్షుడు చెరుకూరు శ్రీనివాసులనాయుడు, పార్టీ నాయకులు టంగుటూరు పద్మనాభరెడ్డి, గూడూరు విష్ణుమోహన్‌రెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, మారంరెడ్డి బుజ్జిరెడ్డి, చెరుకూరు సరళమ్మ, టంగుటూరు సురేష్ రెడ్డి, ఉండాల వంశీకృష్ణారెడ్డి, చిల్లకూరు ప్రవీణ్‌రెడ్డి, తూపిలి ఽఉదయ్‌రెడ్డి, లేబూరు మల్లి, రంగినేని కిరణ్, కిశోర్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే
మీ పరిస్థితి.. మీ ఊహకే..
మా కార్యకర్తల జోలికి వస్తే
సహించేది లేదు
కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరిక