
ఆటోడ్రైవర్లకు అండగా ఉంటాం
నెల్లూరు సిటీ: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు సాయం పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. లక్ష్మీపురంలోని ఎస్‌బీఎస్ కల్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17,406 మంది డ్రైవర్లకు రూ.26.1 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేశామన్నారు. ఎవరికై నా పథకం అందకపోతే సచివాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతోపాటు హెల్ప్‌లైన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. తొలుత నగరంలోని మినీబైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి స్టోన్‌హౌస్‌పేట వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆటోడ్రైవర్ల నుంచి స్పందన కరువైంది. వీరి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు చాలా వరకు ఖాళీగా కనిపించాయి. ఆటోడ్రైవర్లు అరకొరగా కనిపిస్తే.. టీడీపీకి చెందిన మహిళలతో కల్యాణ మండపాన్ని నింపేయడం విస్మయాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చందర్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.