
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు (అర్బన్): పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమ్మె శనివారం ఐదో రోజూ కొనసాగింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె ఆపేది లేదని ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేత డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని 52 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఓపీ సేవలను బహిష్కరించారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది డాక్టర్లు విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనే దానికి వెళ్లారు. మరికొంత మంది డాక్టర్లు స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా కార్యాలయం మందు ధర్నా చేశారు. డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు పోగా ప్రభుత్వం కొంత గడువు కావాలని , ఈ లోపు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు సమ్మె బాట పట్టామన్నారు. పీహెచ్‌సీల్లో 20 నుంచి 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా డాక్టర్లు పని చేయడం బాధాకరమన్నారు. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితితో ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించేందుకు జీఓ నంబర్ 99ను రద్దు చేయాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని అటవీ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలన్నారు. సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలన్నారు. డాక్టర్లు సమ్మెలో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రావణి, జ్యోతిరాణి, విజయలక్ష్మి, సాయిప్రియాంక, రమ్య, మనోజ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.