
9వ తేదీ స్కానింగ్‌కు రమ్మన్నారు
– సుబ్బమ్మ, వెంకటరెడ్డిపల్లి, కలువాయి మండలం
నేను వయోభారంతో ఉన్నాను. ఆరోగ్యం బాగలేక శనివారం మరో ఇద్దరిని తోడు తీసుకుని పెద్దాస్పత్రికి వచ్చాను. డాక్టరమ్మ రక్తపరీక్షలతోపాటు పెల్విస్‌కి స్కానింగ్ రాశారు. అయితే స్కానింగ్ వారు ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నారు. నాకు 9వ తేదీ స్కాన్ చేస్తామని చీటీ మీద రాసిచ్చారు. ముందే నొప్పితో బాధపడుతున్నాను. రిపోర్టును చూసి ఆపరేషన్ చేస్తామని గైనకాలజీ విభాగం డాక్టర్ చెప్పారు. తీరా స్కానింగ్ వద్దకు వస్తే ఐదో రోజులు ఆగి రమ్మని చెప్పడం దారుణం. మా ఊరు నుంచి నెల్లూరుకు వచ్చేదానికి, పోయేదానికి ముగ్గురికి చార్జీలు రూ.600 అయ్యాయి. పైఖర్చులు మరో రూ.200 అయ్యాయి. మళ్లీ ఇంకో రోజు రావాలంటే ఇలాగే ఖర్చులు అవుతాయి. నాలాంటి వాళ్లకు ఇంత స్థాయిలో ఖర్చులు పెట్టుకోవడం, తిరగడం సాధ్యమేనా?. నా పరిస్థితిని, నా వయస్సును పరిగణలోకి తీసుకోవాలి కదా?.
● బుజబుజనెల్లూరు చెందిన హబీబా గత వారంలో గైనకాలజి విభాగంలో వైద్యం కోసం వచ్చారు. డాక్టర్ చెక్ చేసి స్కానింగ్ పరీక్ష రాశారు. స్కానింగ్ వద్దకు వెళ్తే ఆ రోజుకు పేర్లు ఎక్కువగా ఉన్నాయి.. రెండు రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇస్తాం.. ఆ రోజు వచ్చి పరీక్ష చేయించుకోమని సమాధానమిచ్చారు. హబీబా ఎంత బతిమాలిడినా సిబ్బంది ఒప్పుకోలేదు. ఒక్కరే డాక్టర్ ఉన్నారు. సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఆమె ఉసూరుమంటూ ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ ఫుల్‌గా ఉంది. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరొక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉన్నారు. అయినా ఆ రోజు అందరూ లేరని, ఒక్కరే ఉన్నారంటే.. డ్యూటీకి వచ్చి థంబ్ వేసి సొంత, ప్రైవేట్ ప్రాక్టీస్‌కు వెళ్లిపోయి ఉంటారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన రేడియాలజి ప్రొఫెసర్ హెచ్‌ఓడీ రూమ్‌కు పరిమతం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు లేకపోలేదు.