
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
● ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి వినతిపత్రం
నెల్లూరు (అర్బన్): రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమించక తప్పదని ఆ శాఖ ఉద్యోగులు, ఏపీ ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అమరావతి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎం శరత్‌బాబు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఎస్‌ఈ గంగాధరంను కలిసి వినతి పత్రం అందజేశారు. శరత్‌బాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని గత ఏప్రిల్‌లోనే రాత పూర్వకంగా అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటికి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. తిరుపతి జిల్లాకు బదిలీ చేసిన 17 మందిని తక్షణమే జిల్లాకు తీసుకురావాలన్నారు. అందులో దివ్యాంగురాలైన మహిళను తిరుపతి జిల్లాకు పంపడం బాధాకరమన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొంది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగులు నాలుగు నెలలు విధులు నిర్వర్తించాక రివర్షన్ పొందిన ఉద్యోగులు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలని, వారి పదోన్నతులు కొనసాగించాలని కోరారు. సీనియార్టీ ప్రకారం పెండింగ్‌లో ఉన్న టెక్నికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉద్యోగులకు జేటీఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మస్తానయ్య, నారాయణ, సురేష్, నాగేశ్వరరావు, షబ్బీర్ అహ్మద్, రత్నం తదితరులు పాల్గొన్నారు.