
నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ
● ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): కేసుల్లో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలని సూచించారు. మహిళల భద్రత, మత్తు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నంబర్లాట, పేకాట తదితరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, నేరాలకు తరచూ పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, జిల్లాను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లను నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలను ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించి, అక్కడి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్నెస్‌లో పొందుపర్చడంతో పాటు రాత్రి గస్తీని పెంచి అనుమానితుల వేలిముద్రలను సేకరించాలన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు అందే నష్టపరిహారంపై సఖీ వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది తెలియజేశారు. ఏఎస్పీ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.