
న్యాయం చేయాలని వేడుకోలు
నెల్లూరు(క్రైమ్): సమస్యలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని పలువురు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 78 మంది తమ సమస్యలను వినతుల రూపంలో నెల్లూరు రూరల్, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన వారు చట్టపరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● చిన్నకుమారుడు పెంచలకృష్ణ ఆస్తి కోసం నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తీవ్రంగా కొడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు.
● నాపేరుపై ఉన్న ఆస్తిని కుమారుడు తీసుకుని ఇంటి నుంచి గెంటేశాడు. తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంటున్నాను. దీనిపై తగిన చర్యలు తీసుకోవాని జలదంకికి చెందిన ఓ వృద్ధురాలు విన్నవించారు.
● పొదలకూరుకు చెందిన శ్రీనివాసులు, హైదరాబాద్‌కు చెందిన రవికుమార్ క్రిప్టో కరెన్సీలో నగదు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టించారు. విచారించగా అదంతా మోసమని తేలింది. నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● రామ్‌నారాయణ అనే వ్యక్తి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని బెదిరింపులకు దిగడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని రామ్‌నారాయణ బెదిరిస్తున్నాడని కలువాయికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● నా పెద్ద కుమార్తె ఉదయగిరి ఆనకట్టలో పడిపోయిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయి. లోతుగా దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఉదయగిరికి చెందిన ఓ తండ్రి కోరారు.
● నాకు ఆరునెలల క్రితం వివాహమైంది. భర్త, అత్తింటివారు అదనపుకట్నం, బంగారు కోసం వేధిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే విడాకులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్‌కు చెందిన ఓ మహిళ కోరారు.
రక్షణ కల్పించాలి : బీజేపీ నాయకురాలు
తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ నాయకురాలు కె.రాజేశ్వరి కోరారు. ఆమె శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలోని తన పొలంలో వంద టేకుచెట్లను కొందరు గతనెల 26వ తేదీన నరికి తీసుకెళ్లారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనపై పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తమకే ఇలా ఉంటే సామాన్యు ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.