
రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ ఎం.పృథ్వీరాజ్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యాడు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో సోమవారం వీసీ అల్లం శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి కారణంగా వీఎస్‌యూ అభివృద్ధి చెందుతోందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పృథ్వీరాజ్ ప్రతిభ చూపాడని, ఈనెల 29 తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటారని తెలియజేశారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో చుక్కల పార్థసారథి, 2021 – 22లో సాత్విక, 2022 – 23 సంవత్సరానికి పృథ్వీరాజ్ ఎంపికవడం గొప్ప విషయమన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ లీకై అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పారు. వివరాలు.. పొగతోటలోని అలీస్ స్పెషాల్టీ ఆస్పత్రి నాలుగో అంతస్తులో సిబ్బంది ఉంటున్నారు. సోమవారం అక్కడ వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. డీఎఫ్‌ఓ వాకా శ్రీనివాసులురెడ్డి ఆదేశాల మేరకు లీడింగ్ ఫైర్‌మెన్ సీహెచ్ నారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముంది. అతికష్టంపై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష మేర ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక