
ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో తపస్య (57 కేజీలు) భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని అందించింది. బుధవారం జరిగిన ఫైనల్లో తపస్య 5–2 పాయింట్ల తేడాతో ఫెలిసిటాస్ దొమయెవా (నార్వే)పై విజయం సాధించింది. సెమీఫైనల్లో తపస్య 4–3తో సొవాకా ఉచిద (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 9–0తో రొమైసా (ఫ్రాన్స్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో డొల్జాన్ (రష్యా)పై గెలుపొందింది.
భారత్‌కే చెందిన సృష్టి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 68 కేజీల ఫైనల్లో సృష్టి 0–7తో రే హోషినో (జపాన్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) కూడా స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. వీరిద్దరూ తమ కేటగిరీల్లో ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో రీనా 11–1తో అలెగ్జాండ్రా వాయిసులెసు్క(రొమేనియా)పై, ప్రియ 10–0తో ఎవెలిన్ ఉజెల్జి (సెర్బియా)పై విజయం సాధించారు.
అంతకుముందు రీనా క్వార్టర్ ఫైనల్లో 8–2తో జెర్డా టెరెక్ (హంగేరి)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–6తో ఖాలియున్ బ్యామ్‌బసురెన్ (మంగోలియా)పై... ప్రియ క్వార్టర్ ఫైనల్లో 4–0తో డయానా టిటోవా (రష్యా)పై, తొలి రౌండ్‌లో 10–0తో వెరోనికా నికోస్ (హంగేరి)పై గెలుపొందారు. నేడు జరిగే ఫైనల్స్‌లో నదియా సొకోలోవ్‌స్కా (ఉక్రెయిన్)తో ప్రియ; ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా)తో రీనా తలపడతారు.