ENG VS IND 2nd Test Day 2: ప్రమాదం‍లో కోహ్లి రికార్డు | Shubman Gill Aims To Break Virat Kohli's Iconic Record In India Vs England Edgbaston Test | Sakshi
Sakshi News home page

ENG VS IND 2nd Test Day 2: ప్రమాదం‍లో కోహ్లి రికార్డు

Jul 3 2025 3:53 PM | Updated on Jul 3 2025 5:09 PM

Shubman Gill Aims To Break Virat Kohli's Iconic Record In India Vs England Edgbaston Test

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ అజేయ సెంచరీతో (114), రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 87, కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, షోయబ్‌ బషీర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు శుభ్‌మన్‌ గిల్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రెండో రోజు గిల్‌ మరో 36 పరుగులు చేస్తే, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై 150 పరుగులు మార్కును తాకిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ తరఫున ఇప్పటివరకు ఎవరూ 150 పరుగుల మార్కును తాకలేదు. 

2018లో విరాట్‌ 149 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. విరాట్‌ రికార్డును ఛేదించే క్రమంలో గిల్‌ సచిన్‌ టెండూల్కర్‌, రిషబ్‌ పంత్‌లను అధిగమించే అవకాశం ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో సచిన్‌ 122, పంత్‌ 146 పరుగులు చేశారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. 

ఛేదనలో బెన్‌ డకెట్‌ (149) సూపర్‌ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్‌ క్రాలే (65), జో రూట్‌ (53 నాటౌట్‌), బెన్‌ స్టోక్స్‌ (33), జేమీ స్మిత్‌ (44 నాటౌట్‌) తలో చేయి వేశారు.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (101), గిల్‌ (147), పంత్‌ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (137), పంత్‌ (118) శతకాలు చేశారు.

ఇంగ్లండ్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్‌ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement