
తొలి వన్డేలో 3 వికెట్లతో నెగ్గిన భారత మహిళల ‘ఎ’ జట్టు
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.
దూకుడుగా ఆడిన అనిక లియరాయిడ్ (90 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రాచెల్ ట్రెనమన్ (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో కెపె్టన్ రాధ యాదవ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది.
వికెట్ కీపర్ యస్తిక భాటియా (70 బంతుల్లో 59; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), ధారా గుజ్జర్ (53 బంతుల్లో 31; 2 ఫోర్లు), రాఘ్వీ బిష్త్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. లూసీ హామిల్టన్, హేవార్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ రేపు జరుగుతుంది.