రేపు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వరి రైతులు తరచూ ఎదుర్కొంటున్న ఎలుకల సమస్యను నివారించి, పంటను కాపాడటానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసే ప్రాంతాలలో ఈనెల 8వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలుకల వల్ల తీవ్ర పంట నష్టం సంభవిస్తోందని, దీనిని నివారించడానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల నుంచి బ్రోమోడయోలోన్ ఎలుకల మందును కలిపిన ఎరను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఎలుకలు ఉన్న బొరియలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచాలని, మరుసటి రోజు తెరుచుకుని ఉన్న బొరియలలో బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను ఉంచి మూసివేయాలని తెలిపారు. రైతులంతా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా వరి పంటను ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, డీఆర్‌ఓ లక్ష్మీ నరసింహం, డెప్యూటీ కలెక్టర్ కె.పోశి బాబు, వ్యవసాయ శాఖ ఏడీ అనిత భాను పాల్గొన్నారు.


