
ఎక్స్‌పోలో ‘నాలా చెఫ్–వింగ్‌మాన్’ ఆవిష్కరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన విజయవాడ ఎక్స్‌పో(ఎగ్జిబిషన్)లో ఆటోమేటెడ్ రోబోటిక్ నాలా చెఫ్–వింగ్‌మాన్ ఆవిష్కృతమైంది. ఈ స్టాల్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో తయారీ, ఆవిష్కరణలు ప్రపంచ స్థాయికి చేరుకుంటున్నాయని, నాలా చెఫ్ ఇందుకు నిదర్శనమన్నారు. ఇది టెక్నాలజీ ఆధారిత కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ‘నాలా చెఫ్–వింగ్‌మాన్’ రూపొందించిన పారిశ్రామికవేత్త అనిల్ సుంకర మాట్లాడుతూ నాలా చెఫ్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, ఇది భవిష్యత్ వంటకాల సాంకేతికతకు నిదర్శనమని చెప్పారు. విజయవాడ నుంచే ఈ భారతీయ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసి గ్లోబల్ కిచెన్స్‌కు కొత్త నిర్వచనం ఇవ్వటమే తమ లక్ష్యం అన్నారు.