ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా- ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశముంది. జెనీవా వేదికగా త్వరలో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఈ అంశమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే హర్ముజ్‌ను దిగ్భందించింది. దీంతో అమెరికా ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లకుండా అమెరికా నౌకలును అడ్డగిస్తూ బ్లాక్‌డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ సైతం గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
జేడీవాన్స్ మాట్లాడుతూ" ఇరాన్‌తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉంది. యుద్ధం ఆగడం మా చేతుల్లో లేదు. బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉంది. ఇరాన్ దిగిరావాలి. ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాలి". అని అన్నారు. జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకోవడం ఆర్థిక ఉగ్రవాదమేనని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక అలా చేస్తే వారి నౌకలను బయిటకి వెళ్లకుండా చేస్తామని హర్ముజ్ వద్ద ఇరాన్ చర్యలను అడ్డుకుంటాం" అన్నారు. హర్ముజ్ విషయంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కాగా అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ సైతం చర్చలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజ్‌ఫైర్ ఒప్పందం ముగిసే లోగా మరోదశ చర్చలు జరపాలని భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం ఈ నెల 16 (గురువారం) నాడు ఇరు దేశాల భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ ఇంతవరకూ స్పందించలేదు.


