
బేల్దారి పనులు.. ఆరితేరి చోరీలు
మారుతాళాలతో ద్విచక్రవాహనాలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్ వాహనాలు కొనుగోలు చేసిన మరో ముగ్గురు కూడా అరెస్ట్ రూ.25 లక్షల విలువ చేసే 50 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నగరంపాలెం: ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన వ్యక్తితోపాటు వాటిని కొనుగోలు చేసిన మరో ముగ్గుర్ని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వారి నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన 50 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... బైకుల చోరీలు ఎక్కువ కావడంతో కొత్తపేట పోలీస్‌స్టేషన్ సీఐ వీరయ్యచౌదరి కేసు నమోదు చేశారన్నారు. తూర్పు సబ్ డివిజనల్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో కొత్తపేట పీఎస్ సీఐ వీరయ్య చౌదరి, ఎస్‌ఐ రమేష్ ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం లక్ష్మీటాకీస్ రోడ్డులో ఉంటున్న బొప్పూరి మల్లికార్జునరావు (52) అలియాస్ పున్నారావు అలియాస్ పెద్ద ఆంజనేయులును మాయాబజార్‌లో గుర్తించామన్నారు. గౌరీశంకర్ థియేటర్ పరిసరాల్లో ద్విచక్ర వాహనాలు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. నేరం రుజువు కావడంతో అతనితోపాటు వాహనాలను కొనుగోలు చేసిన గురజాలకు చెందిన బైక్ మెకానిక్ రాజశేఖర్, గొర్రెల కాపరి మహేష్, సాతులూరుకు చెందిన బేల్దారి మేసీ్త్ర సాంబశివరావులను అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు.
18 నెలలుగా దొంగతనాలు
మల్లికార్జునరావు బేల్దారి పనులకు వెళుతూ మద్యానికి బానిసయ్యాడని తెలిపారు. భార్యతో గొడవ పడి సుమారు రెండేళ్ల క్రితం గుంటూరు నగరానికి వచ్చాడన్నారు. ఆరోగ్యం బాగాలేక జీజీహెచ్‌లో చేరి, చికిత్స అనంతరం ఇక్కడే లాడ్జిల్లో ఉంటూ పనులకు వెళ్లేవాడని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో, రైల్వేస్టేషన్ పరిసరాల్లో పాత బైకులను మారు తాళాలతో 18 నెలలుగా దొంగిలించాడని చెప్పారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్ల, గుంటూరు జిల్లాలోని పాతగుంటూరు, లాలాపేట, అరండల్‌పేటలో అధికంగా దొంగిలించినట్లు విచారణలో గుర్తించామన్నారు. 37 బైకుల యజమానుల చిరునామాలు గుర్తించామని చెప్పారు. బాధితులు ఎవరైనా ఉంటే కొత్తపేట పీఎస్‌లో సంప్రదించాలని సూచించారు. కేసులో ప్రతిభ చూపిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతోపాటు హెచ్‌సీ ఎం.కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు డి.కోటేశ్వరరావు, టి.అనిల్, షేక్ జానీ బాషా, సీహెచ్ శ్రీనివాసరావు, డి.దేవభిక్షం, ఎన్‌ఎస్‌ఆర్ కోటేశ్వరరావులను జిల్లా ఎస్పీ అభినందించారు.